టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న మాజీ డిప్యూటీ మేయర్..!

Monday, December 14th, 2020, 03:46:06 PM IST

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కోలుకోకముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లాలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్‌కు పంపించారు. అంతేకాదు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కూడా కలిశారు. ఈ మేరకు తాను త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు గుగ్గిలపు రమేష్ ప్రకటించారు.

అయితే దీనిపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ నేడు జిల్లా కీలక నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ఎవరూ చింతించాల్సిన పని లేదని పార్టీ అధినేత సీఎం కేసీఆర్, కేటీఆర్, తాను ఎప్పుడూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా గత కొద్ది రోజుల నుంచి పలువురు కీలక నేతలు, మాజీ కార్పొరేటర్లు, టికెట్ రాని అసంతృప్తులు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాకిచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.