తెలంగాణా తెరాస సొంతమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్

Thursday, May 15th, 2014, 10:03:43 AM IST


సార్వతిక ఎన్నికల ఫలితాలపై జాతీయ, ప్రాంతీయ న్యూస్ చానెళ్ళు తమ సర్వే ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఎప్పటికప్పుడు టీవీలలో ప్రసారం చేసి హొరెత్తిస్తున్నారు. మరి వీరి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మే 16వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సిందే. అయితే సీమాంధ్ర ఫలితాలపై ఒక్కో చానెల్ ఒక్కో నివేదిక సమర్పిస్తూ ఉండగా తెలంగాణా ఫలితాల విషయంలో మాత్రం అందరూ ఒకే తాటిపై నడుస్తున్నారు.

ఇటీవల జాతీయ టీవీ అయిన ఎన్డిటివి తన తాజా ఎగ్జిట్ పోల్ సర్వేలో సీమాంద్రలో తెలుగుదేశం మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఉన్నాయని పేర్కొంది. కాగా సీమాంద్రలోని 175 స్థానాలకు 88 స్థానాల వరకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పింది. అయితే ప్రాంతీయ టీవీ చానెల్ అయిన మాహా టీవీ సర్వేలో సీమాంధ్రలో 175 స్థానాలకు గాను 129 స్థానాలను టిడిపి కైవసం చేసుకుంటుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. అయితే అన్ని జాతీయ చానెళ్ళు, ప్రాంతీయ చానెళ్ళు కూడా తెలంగాణా ప్రాంతంలో తెరాస పార్టీ నే లోక్ సభ, అసంబ్లీ స్థానాలలో అధికశాతం సీట్లను సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నిగ్గు తేల్చాలంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యేదాకా వేచి చూడాల్సిందే.