బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్.. సభలో నవ్వులే నవ్వులు..!

Tuesday, January 19th, 2021, 01:22:00 AM IST


దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ బీజేపీలో చేరిపోయారు. వికారాబాద్‌లో నిర్వహించిన భారీ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ చంద్రశేఖర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే 1985-2008 మధ్య చంద్రశేఖర్ ఐదు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇదిలా ఉంటే బీజేపీలో చేరిన సందర్భంగా మాట్లాడిన చంద్రశేఖర్ సీఎం కేసీఆర్‌పై జోకులు వేసి సభా ప్రాంగణమంతా నవ్వులు పూయించారు. కేసీఆర్ ఇంట్లో తన బావమరిది పని చేస్తారని, అయితే ఓ రోజు మధ్య రాత్రి కేసీఆర్ హఠాత్తుగా నిద్రలో లేచి కూర్చున్నాడట అని, గ్లాసు నీళ్లు ఇచ్చి ఏమయ్యింది దొర అని మా బామర్ధి అడగగా, బండి సంజయ్ కలలో వచ్చాడని నా గల్లా పట్టుకుని ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి ఏమయ్యిందని ప్రశ్నించాడని, బండి సంజయ్ పేరు వింటేనే నా లుంగీ అంతా తడిసిపోయిందని చెప్పాడట అని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.