రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి..!

Saturday, March 13th, 2021, 11:40:34 AM IST

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిన్నటితోనే ముగిసింది. రేపు జరగబోయే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ ‌గోయల్‌ తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికలు సాఫీగా జరిగేలా అందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని శశాంక్ గోయల్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 5,31,268 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,36,256 మంది, మహిళలు 1,94,944 మంది ఉన్నారు. ఇక ఈ స్థానానికి బరిలో 93 మంది అభ్యర్థులు ఉండగా, 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో స్థానమైన నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పరిధిలో మొత్తం 5,05,565 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక ఈ స్థానానికి బరిలో 71 మంది అభ్యర్థులు నిలవగా 731 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 17న ఈ రెండు స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి.