తెలంగాణ ప్రజలకే ముందుగా వ్యాక్సిన్.. మంత్రి ఈటల డిమాండ్..!

Saturday, November 28th, 2020, 01:14:47 AM IST


భారత్‌లో పలు కరోనా వ్యాక్సిన్‌లు మూడో దశ ప్రయోగంలో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ కంపెనీ కొవాక్జిన్ అభివృద్ధి పరిశీలనకు రేపు ప్రధాని మోదీ హైదరాబాద్ రాబోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం గర్వకారణమని అన్నారు.

అయితే తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి ఆ ఫలితం ముందుగా ఇక్కడి ప్రజలకే అందాలని ఈటల అన్నారు. రాష్ట్ర ప్రజలకు సరిపోయేన్ని వాక్సిన్ డోస్‌లు ఇవ్వాలని ప్రధాని మోదీనీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని, దానిని త్వరగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధానిని కోరుతామని మంత్రి ఈటల తెలిపారు.