ప్రజల మధ్య చిచ్చు పెట్టే పనులు మానుకోవాలి – ఈటెల రాజేందర్

Sunday, December 20th, 2020, 02:02:21 PM IST

తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ పుంజుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నిక లో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గత సారి కంటే మెరుగ్గా ఫలితాలను రాబట్టుకుంది. అయితే ఈ మేరకు బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తిప్పి కొట్టారు. బీజేపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా కలిసి మెలిసి ఉండే తెలంగాణ ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విషం చిమ్ముతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ప్రజల మధ్య చిచ్చు పెట్టే పనులు మానుకోవాలి అని ఈటెల రాజేందర్ అన్నారు. ఒకట్రెండు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన విర్రవీగడం పనికిరాదు అని అన్నారు. స్థాయిని మించి విమర్శలు చేయొద్దు అని తెలిపారు. బీజేపీ పాలన లో నిరుద్యోగం పెరిగింది అని, పరిశ్రమల రాక తగ్గుతోంది అని విమర్శించారు. ఈ మేరకు బీజేపీ పాలన విధానం పై, తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల పై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.