బీజేపీలో మాజీ మంత్రి ఈటల చేరికకు ముహూర్తం ఖరారు..!

Thursday, June 10th, 2021, 10:09:36 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న తెలిసిందే. అయితే తాజాగా ఈటల బీజేపీలో చేరికకు సంబంధించిన ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదిన ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేడు పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.

అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈ నెల 14న ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరుతున్నారని, ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ కూడా పార్టీలో చేరబోతున్నారని బండి సంజయ్ ప్రకటించారు. ఇకపోతే తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకి ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.