ప్రైవేట్ ఆసుపత్రుల దోపీడికి చెక్.. మంత్రి ఈటల కీలక నిర్ణయం..!

Sunday, August 2nd, 2020, 12:26:33 AM IST


తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా బాధితులు పెరిగిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం ఉండదని భావిస్తూ చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదునుగా చూసుకుని లక్షలకు లక్షలు దోచుకుంటున్నాయి.

అయితే ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినా మందులు, పీపీఈ కిట్లు, ఐసీయూ చార్జీలు అంటూ అడ్డగోలుగా దండుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై నేడు సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల ప్రైవేట్ ఆసుపత్రులు లాభాల కోసం మానవతా దృక్పదం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో వైద్యం అందించాల్సిన పరిస్థితులలో సొమ్ము చేసుకోవడం మంచిది కాదని అన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులు అమలు చేసేలా తీసుకోవటం, బెడ్స్ ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందించేలా చూడాలని కోరారు.