తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ లేదు.. మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు..!

Sunday, January 10th, 2021, 01:12:29 AM IST

తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలంపై స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ లేదని, రాష్ట్రానికి అసలు బర్డ్‌ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని ఎవరూ అందోళన చెందవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకండని ఈటల చెప్పుకొచ్చారు.

ఇకపోతే కరోనా వ్యాక్సిన్‌పై కూడా మాట్లాడిన ఈటల కేంద్రం రాష్ట్రానికి ఎప్పుడు కరోనా వ్యాక్సిన్ పంపించినా ప్రజలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సిద్దంగా ఉందని, రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రెండో దశ డ్రై రన్ విజవంతమైందని, వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహాలు వద్దని మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటానని ఈటల అన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌ వైరస్ గురించి కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు.