ఏకగ్రీవం వొద్దు… నోటా కింద ఎన్నికలు నిర్వహించాలి

Tuesday, March 16th, 2021, 07:28:21 AM IST

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. అయితే అందులో ఏకగ్రీవాలు కూడా ఎక్కువగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లో ఒక పిల్ దాఖలైంది. స్థానిక ఎన్నికల తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే అభ్యర్ధి బరిలో ఉన్న చోట ఆ వ్యక్తి ఏకగ్రీవం గా ఎన్నిక అయినట్లు ప్రకటించకుండా, నోటా కింద ఎన్నికలు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

అయితే ఒకే అభ్యర్ధి బరిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏకగ్రీవం అయినట్లు ప్రకటిస్తూ ఫారం 10 జారీ చేయాలి అని చెబుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్ 16 అమలును, ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 34 అమలు ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు పీపుల్స్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు, మరోక వ్యక్తి పిల్ దాఖలు చేశారు. అయితే దీని పై విచారణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కి, ఎన్నికల కమిషనర్ కి కోర్టు నోటీసులు అందజేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి అని తెలిపింది. ఇందుకు సంబంధించిన విచారణ ఆగస్ట్ 16 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.