దుబ్బాకలో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

Tuesday, November 3rd, 2020, 08:40:23 PM IST

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉండగా అందులో 98,028 మంది పురుష ఓటర్లు, 10,0719 మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం ఆరు గంటలలోపు క్యూ లైన్‌లో నిలబడి ఉన్నవారందరికి ఓటు హక్కును వినియోగించే అవకాశం కల్పించారు.

అయితే ఉదయం 10 గంటల సమయానికి 30 శాతం ఓటింగ్ నమోదవ్వగా, మధ్యాహ్నం ఒంటిగంట దాటే సమయానికి 50 శాతం ఓటింగ్ నమోదయ్యింది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 82 శాతంకి పైగా ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత 2018 ఎన్నికలో 86.22 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ బీజేపీది విజయమని తేల్చింది. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం దక్కగా, 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండో స్థానం, 13 శాతం ఓట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. ఇక మరో ఎగ్జిట్ పోల్ సంస్థ థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) టీఆర్ఎస్‌దే విజయమని ప్రకటించింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు తొలిస్థానం దక్కగా, 33-36 శాతం ఓట్లతో బీజేపీ రెండో షానంలో నిలవగా, 8-11 శాతంతో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.