దుబ్బాక బీజేపీలో లొల్లి.. స్థానిక బీజేపీ నేత సస్పెండ్..!

Wednesday, October 7th, 2020, 03:42:40 PM IST

దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం వాడీ వేడీగా సాగుతుంది. అయితే అందరికన్నా ముందు నుంచే ఇక్కడ ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ అందరూ అనుకున్నట్టే గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన రఘునందన్ రావుకు మరోసారి టికెట్ కట్టబెట్టింది.

అయితే రఘునందన్ రావుకు బీజేపీ అదిష్టానం నిన్న టికెట్ ఖరారు చేయడంతో అసంతృప్తి బయటపడింది. రఘునందన్ రావుకు బీజేపీ దుబ్బాక టికెట్ ప్రకటించడంపై స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచించాలని లేదంటే బీజేపీ ప్రతిష్ట దిగజారుతోందని ఆరోపణలు చేశారు. అయితే పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించిన తోట కమలాకర్ రెడ్డిని బీజేపీ అదిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.