కరోనా పట్ల ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి గమనించాం

Friday, November 13th, 2020, 02:16:56 PM IST

చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే మూడు నెలలు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తం గా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు.అయితే వచ్చే నెలలో వివాహాలు ఉన్నాయి అని, వాటికి దూరంగా ఉండటం మంచిది అని పేర్కొన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి అని, మరో మూడు నెలల్లో వాక్సిన్ వస్తుంది అనే ఆశాభావం తో ఉన్నాం అని శ్రీనివాస్ తెలిపారు.

అయితే వాక్సిన్ వచ్చే వరకు కూడా గత ఎనిమిది నెలలు ఎలా అయితే కరోనా వైరస్ నిబంధనలు పాటించామో అలానే ఉండాలని సూచించారు. దీపావళి, వివాహాలు, శుభకార్య క్రమాల సందర్భం గా షాపింగ్ చేస్తున్నారు అని, ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపై ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే కొంతమంది ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి గమనించాం అని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కొనేవారు, అమ్మేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని తెలిపారు.

మాస్కులు సరిగ్గా ధరించడం లేదు అని, భౌతిక దూరం పాటించడం లేదు అని, జనం రద్దీ ఉన్న చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు. అయితే దీపావళి ను దీపాలతో జరుపుకుందాం అని, బాణసంచా కి దూరంగా ఉందాం అని హితవు పలికారు.