దుబ్బాకలో సర్వేలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి – డీకే అరుణ

Monday, October 26th, 2020, 06:24:06 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుని ప్రత్యర్ధి పార్టీలకు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈ ఎన్నికలలో గెలిచి రానున్న ఎన్నికలలో తమదే అధికారం అని చెప్పుకోవాలని కాంగ్రెస్, బీజేపీ తహతహలాడుతున్నాయి. అయితే నేడు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లలో, కార్యాలయాల్లో, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

అయితే రఘనందన్‌రావు బంధువుల పోలీసులు ఇళ్ళలో సోదాలను నిర్వహించడాన్ని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఖండించారు. వేల కోట్లున్న టీఆర్ఎస్ నేతలను వదిలేసి బీజేపీ నేతల ఇళ్లపై పడటం సిగ్గుచేటన్నారు. పోస్టింగుల కోసం పోలీసులు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వేలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రావడాన్ని మంత్రి హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని, ఎలాగైనా గెలవాలని ఆయన అడ్డదారులు తొక్కుతున్నారని దుయ్యబట్టారు.