ఈటల భయంతోనే సీఎం మార్పు ప్రచారం ఆగింది – డీకే అరుణ

Thursday, February 11th, 2021, 10:00:49 PM IST

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. నిన్న హాలియా సభలో ప్రసంగిస్తూ మహిళలను కుక్కలతో పోల్చిన సీఎం కేసీఆర్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌కు పతనం చెందే సమయం దగ్గరకొచ్చిందని అందుకే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్‌కి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు.

అయితే మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే భయంతోనే సీఎం మార్పు ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారని చెప్పుకొచ్చారు. తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని అది ఎప్పటికి తీరని కలలుగానే ఉంటాయని డీకే చెప్పుకొచ్చారు. అలాగే వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి వెనుక ఎవరున్నారన్నది అందరికి తెలుసని అసలు షర్మిలకు తెలంగాణతో ఏం సంబంధం అని డీకే అరుణ ప్రశ్నించారు.