సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యలపై డీకే అరుణ ఫైర్..!

Thursday, May 6th, 2021, 03:00:33 AM IST

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆమె కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కానీ రాష్ట్రంలో కరోనా బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ చెబుతుండడం నిజంగా సిగ్గుచేటని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని చెప్పడం నిజంగా ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే క్షేత్రస్థాయిలో కరోనా బారిన పడి ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరోనా బారిన పడిన ప్రజలకు నాణ్యమైన చికిత్సతో పాటు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్, బెడ్లు, మందుల కొరత తీర్చాలని ప్రభుత్వానికి సూచించారు. మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ స్థితిలోకి జారిపోయిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని డీకే అరుణ అన్నారు.