టీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది – డీకే అరుణ

Monday, September 28th, 2020, 04:34:05 PM IST

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పనిచేయబోతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అయితే బీజేపీలో గ్రూపులకు, వర్గాలకు తావులేదని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును కట్టలేని సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు లేదని మండిపడ్డారు. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పాలన మీద తెలంగాణ ప్రజలకు ఓ క్లారిటీ వచ్చిందని, తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని అన్నారు. ఇదిలా ఉంటే తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రానందుకు నిరాశ చెందలేదని, జాతీయ నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని తెలిపారు.