దిశ సినిమాను ఆపండి.. హైకోర్టులో దిశ తండ్రి పిటీషన్..!

Saturday, October 10th, 2020, 02:55:33 PM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గత ఏడాది తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసుపై సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ ఏడాదు నవంబర్ 26 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా వర్మ ఇప్పటికే ప్రకటించారు.

అయితే తాజాగా ఈ సినిమాని కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు ఆపాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మించడం సరికాదని పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే నిన్న దీనిపై విచారణ చేపట్టగా, ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ ఎలాంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరపు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌ రావు కోర్టుకు తెలిపారు. అయితే పిటీషనర్ ఇచ్చే వినతిపత్రంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, సెన్సార్ బోర్డును ఆదేశించింది.