ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా – దేవినేని ఉమా

Tuesday, September 22nd, 2020, 12:33:30 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు 280 రోజులుగా నిరవధిక నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని పోరాటాలు చేస్తున్నా మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే మూడు రాజధానుల అంశంపై మరోసారి స్పందించిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ప్రజా రాజధాని ఉద్యమం 280 రోజులకు చేరిందని, ఒకసారి రాజధానిగా అమరావతి నిర్ణయించాక మళ్లీ మూడు రాజధానులు ఎందుకు అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం ఇబ్బందిపెట్టడం తగదని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అని నిలదీశారు. ఢిల్లీలో సైతం అన్ని పక్షాలు తెలిపిన మద్దతు తాడేపల్లి రాజప్రాసాదానికి కనబడలేదా అంటూ విమర్శలు గుప్పించారు.