ప్రజల్లోకి వెళ్తే ఏం జరిగిందో…ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో అర్థమైందా?

Sunday, January 3rd, 2021, 10:00:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న ఘటనలతో అధికార పార్టీ వైసీపీ కి మరియు ప్రతి పక్ష పార్టీ టీడీపీ కి మధ్యలో మాటల యుద్దాలు జరుగుతున్నాయి. మరొకసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ నేతల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పండబెట్టారు అని, విశాఖ లో భూ దందాలు చేస్తూ పెట్టుబడులు పంపించేశారు అంటూ దేవినేని ఉమా విమర్శించారు. అంతేకాక కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ ఆరోపించారు. అయితే ఉత్తరాంధ్ర కి గ్రహణం లాగా పట్టిన ట్విట్టర్ లో కూసే ఎంపీ విజయసాయి రెడ్డి కి ప్రజల్లోకి వెళ్తే ఏం జరిగిందో, ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో అర్థం అయిందా సీఎం జగన్ అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.

అయితే విజయసాయి రెడ్డి పై జరిగిన దాడి కి కారణం టీడీపీ నే అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రామతీర్థం ఘటనలో ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు వంశ పారంపర్య ట్రస్టీ అశోక్ గజపతి రాజు గారి తొలగింపు అంటూ దేవినేని ఉమా అన్నారు. మరి బెజవాడ దుర్గమ్మ రథం, మూడు వెండి సింహాల మాయం, అంతర్వేది రథం దగ్దం సహ దేవాలయాల్లో జరిగిన 129 ఘటనల కి మీ మంత్రి పై, మీ పై ఏం చర్యలు తీసుకోవాలని అంటున్న ప్రజలకు సమాధానం చెప్పండి సీఎం జగన్ అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.