ఏపీ లో స్థానిక ఎన్నికలు నియంతృత్వ పోకడలకి పరాకాష్ట – దేవినేని ఉమా

Tuesday, February 23rd, 2021, 07:00:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కలిగిన అభ్యర్దులు భారీగా విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల నిర్వహణ విషయం లో వైసీపీ వ్యవహరించిన తీరు పట్ల తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక ఎన్నికలు నియంతృత్వ పోకడలకి పరాకాష్ట అంటూ చెప్పుకొచ్చారు. హింసించినా, వేధించినా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభ్యర్ధులు ధైర్యంగా నిలిచి పోరాడారు అని వ్యాఖ్యానించారు. వందలాది దాడులు, వేలాది దౌర్జన్యాలతో ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణం లో జరగక పోయినా, 4,230 పంచాయతీ లలో తెలుగు దేశం పార్టీ మద్దతు దారులు గెలవడం మార్పు కి నాంది కాదా వైఎస్ జగన్ అంటూ దేవినేని ఉమా సూటీగా ప్రశ్నించారు.

అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలిచిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలిచినట్లు గా ప్రచారం చేసుకుంటున్నారు అని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. తమ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్ధులు గెలిచిన జాబితా ను తమ సైట్ లో ఉంచామని, మీరు కూడా ఫోటోలతో సహా జాబితా తెలపండి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు దేవినేని ఉమా ఈ విధంగా స్పందించారు.