మీ సలహాదారు ప్రకటన దేనికి సంకేతం… దేవినేని ఉమా సూటి ప్రశ్న

Friday, January 15th, 2021, 03:25:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు రాజధానుల ప్రస్తావన మొదటి నుండి నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రకటన చేశారు. అయితే రాబోయే నెలల్లో కోర్టుల్లో ఉన్న కేసులు కూడా క్లియర్ అయి నాలుగు నెలల్లో రాజధాని తరలింపు జరుగుతుంది అంటూ ఇటీవల ప్రభుత్వం చీఫ్ విప్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. అయితే మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ కీలక నేత దేవినేని ఉమా ఈ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యాయస్థానాల్లో కేసులు ఉన్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా కార్యాలయాల తరలింపు జరుగుతుంది అని దేవినేని ఉమా అన్నారు. నాలుగు నెలల్లో రాజధాని మారుతుంది అని మీ సలహాదారు ప్రకటన దేనికి సంకేతం అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ విశాఖ లో మీ నేతలు దోచుకున్న భూములు అమ్ముకోవడం కోసమే రాజధాని మార్పు డ్రామాలు అంటున్న ప్రజల మాట వాస్తవం కాదా జగన్ అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ను టార్గెట్ చేస్తూ దేవినేని ఉమా చేస్తున్న వ్యాఖ్యలకు నెటిజన్లు సైతం మద్దతు ఇస్తున్నారు. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.