ఏపీలో మరో ఘటన.. హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు..!

Thursday, September 17th, 2020, 08:30:25 AM IST

ఏపీలో రోజు రోజుకు ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయి. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన మరువకుమందే మొన్న విజయవాడ రూరల్‌లోని నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ గుడిలో మూడు వెండి రథం సింహాలు మాయమవ్వడం కలకలం రేపింది. మొత్తం నాలుగు సింహాలకు గాను ప్రస్తుతం ఒక్కటే సింహం మిగిలి ఉంది.

అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం అయింది. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో దుండగులు హనుమాన్‌ విగ్రహం చేయిని విరగొట్టారు. ఈ ఘటనపై స్థానికులు, హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వరుస ఘటనల నేపథ్యంలో హిందూ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.