కోర్టులు స్టే ఇవ్వడం సరికాదు.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కామెంట్స్..!

Monday, August 17th, 2020, 11:58:10 PM IST


ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోర్టు తీర్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఋ-5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అటు హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అయితే దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయ్యారు చేయవని అన్నారు.

పేదలకు ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరికాదని అన్నారు. ఇళ్ల స్థలాల అంశంలో కోర్టులు వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడుతున్నారని అన్నారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికీ మూడు తేదీలు పెట్టడం బాధాకరమని అన్నారు.