తప్పని నిరూపిస్తే గొంతుకోసుకుని చనిపోతా.. దాసోజు శ్రవణ్ మరోసారి సవాల్..!

Sunday, February 28th, 2021, 03:00:46 AM IST

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ చెప్పడంతో దీనిపై ప్రస్తుతం ప్రతిపక్షాల నుంచి సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. కేటీఆర్ చెబుతున్నవన్ని అబద్ధాలు అని గన్‌పార్క్ వద్ద ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే నేడు దాసోజు శ్రవణ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ఎవడో గొట్టంగాడు గన్‌పార్క్‌ దగ్గరకు చర్చకు రమ్మంటే మంత్రి కేటీఆర్‌ వస్తారా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

అయితే తలసాని వ్యాఖ్యలకు దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తన పేరును తోకముడిచిన తారక రామారావు అని మార్చుకోవాలని, చర్చకు సిద్ధమని తేలుకుట్టిన దొంగలా పారిపోయారని అన్నారు. ఆకు రౌడీ ఆలుగడ్డల శ్రీనివాస్‌తో తనను తిట్టించడం కేటీఆర్‌కు తగదని, తలసాని ఓ బుద్దిలేని సన్నాసి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి తలలేని శ్రీనివాస్‌కు ఏం సంబంధం అని, ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రాజకీయ బిక్షగాడు తలసాని అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా దిగిపోయే నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ అయితే 10 వేల ఉద్యోగాలే వచ్చాయనడం పచ్చి అబద్ధమని అన్నారు. నేను చెప్పేది తప్పని గన్ పార్క్‌కు వచ్చి మంత్రి కేటీఆర్ నిరూపిస్తే అక్కడే గొంతుకోసుకుని చనిపోతానని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు.