కేసీఆర్‌కు ఎన్నికల మీద ఉన్న ధ్యాస ప్రజల ఆరోగ్యంపై లేదు – దాసోజు శ్రవణ్

Thursday, March 25th, 2021, 03:01:27 AM IST


సీఎం కేసీఆర్‌కు ఎన్నికల మీద ఉండే శ్రద్ద, ధ్యాస ప్రజల ఆరోగ్యం పట్ల లేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కరోనా కట్టడిపై కేసీఆర్ సోయిలేకుండా ప్రవర్తిస్తున్నారని ఇప్పటివరకు 9,40,000 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇంకెన్ని రోజులు సమయం కావాలని ప్రశ్నించారు.

అయితే పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 47లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చారని కానీ మన రాష్ట్రం ఎందుకు ఈ విషయంలో వెనకబడిందని నిలదీశారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఇకపై అన్నిప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని దాసోజు డిమాండ్ చేశారు. ఫీజుల వసూల్ కోసమే స్కూళ్లు, కాలేజీలు తెరిచారని అవి వసూల్ చేసుకుని ఇప్పుడు మూసేశారని అన్నారు. బార్లు, థియేటర్లు, మాల్స్ కూడా మూసేయాలని సూచించారు.