చావు కబురు చల్లగా హీరోకు సైబరాబాద్ పోలీసుల వార్నింగ్..!

Friday, March 19th, 2021, 11:03:54 PM IST


ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాని ఎంతగా వాడుతున్నారన్న విషయం పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం పలు రకాల వీడియో సందేశాలను, మీమ్‌లను పోస్టు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా నేడు రిలీజైన చావు కబురు చల్లగా సినిమా పోస్టర్‌ను కూడా వాడేసుకున్నారు. అంతేకాదు హీరో కార్తికేయకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సినిమాలో హీరో కార్తికేయ (బస్తీ బాలరాజు) హీరోయిన్‌ను బైక్‌పై ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని మరీ ప్రమాదకరంగా బైక్ డ్రైవ్ చేస్తుంటాడు. అయితే హెల్మెట్ పెట్టుకుని సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు.. అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భలే క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారంటూ నెటిజన్లు దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.