తాగి వాహనాలు నడిపేటోళ్ళతో వెళితే కేసులే.. పోలీసుల కొత్త రూల్..!

Thursday, March 11th, 2021, 10:56:59 PM IST

మద్యం తాగి వాహనాలు నడపకండని పోలీసులు ఎంత చెబుతున్నా మందుబాబులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. దీంతో పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తీసుకొస్తూ తాగి వాహనాలు నడిపే వారికి భారీ జరిమానాలతో పాటు అదే స్థాయిలో శిక్షలు కూడా పడేలా నిబంధనలు తీసుకొస్తున్నారు. అయితే మీరు ఏం చేసినా మా తీరు మాత్రం మార్చుకోము అన్నట్టుగా మందుబాబులు వ్యవహరిస్తుండడంతో పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోబోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్‌ పోలీసులు కొత్త చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలను నడిపేవారిపైనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, ఇకపై తాగిన వ్యక్తి నడిపే వాహనంలో ప్రయాణించే వారిపైనా కూడా కేసులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. మోటారు వాహనాల చట్టంలోని 188వ సెక్షన్‌ ప్రకారం డ్రైవింగ్ చేసే వ్యక్తి మద్యం తాగారని తెలిసీ ఆ వాహనంలో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని అంటున్నారు. అయితే ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వాళ్లు కూడా శిక్షార్హులు అవుతారన్నమాట.