వైసీపీ హయాంలో కోళ్లకు కూడా కరోనా వచ్చేట్లున్నది – రామకృష్ణ

Thursday, January 14th, 2021, 08:40:28 PM IST

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది గుమికూడి కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోడి పందాలను అడ్డుకుంటామని ప్రభుత్వం చెప్పింది కానీ, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పందాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు.

అయితే రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరుపుదామంటే కరోనా ప్రభావం తగ్గలేదు అని చెప్పిన ప్రభుత్వం, కోడి పందాల పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోందని అన్నారు. ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కోళ్లకు కూడా కరోనా వచ్చేటట్టు ఉన్నదని రామకృష్ణ ఎద్దేవా చేశారు. పలుచోట్ల కోడిపందాలు నిర్వహిస్తున్నా పోలీసులు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారని, పోలీసులు కోడిపందాల నిర్వాహకులతో లాలూచీ పడ్డారేమో అనిపిస్తుందని అన్నారు. అసలు కోడి పందాల నిర్వాకులపై కేసులు ఎందుకు పెట్టలేదో డీజీపీ సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.