ఆనాడు మాతో పొత్తు పెట్టుకున్న పవన్, నేడు మోడీ కాళ్ళు మొక్కుతున్నాడు

Wednesday, September 30th, 2020, 02:55:07 PM IST

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు పై సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ తో అనవసరం గా పొత్తు పెట్టుకున్నాం అని, అందుకు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాం అని నారాయణ ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేసింది అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఆనాడు మాతో పొత్తు పెట్టుకున్నారు అని, కానీ నేడు ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ దారుణ విమర్శలు చేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి వ్యక్తిత్వమే లేదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రధాన ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలను ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు.