వృద్ధాప్య పెన్షన్లు 2,500లకు పెంచాలి.. సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్..!

Tuesday, September 1st, 2020, 09:30:53 AM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్లను ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుతామని నాలుగేళ్ళలో 3000 చేసి తీరుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వృద్ధాప్య పెన్షన్లను పెంచి 2,500 లుగా అందించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్లను 3 వేలు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ప్రతీ ఏటా 250 మాత్రమే పెంచుతామనే కండిషన్ పెట్టి, మొదటి సంవత్సరం 2,250 చేశారని అన్నారు. అయితే మీరు చెప్పినట్టుగానే ఈ ఏడాది వృద్ధాప్య పెన్షన్లు జూలై నుండి పెంచి ఇవ్వాల్సి ఉందని అయినా ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.