సామాన్యులు, డబ్బులు లేని వారు పోటీ చేసే పరిస్థితులు లేవు

Monday, November 23rd, 2020, 02:20:32 PM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులు మరియు డబ్బులు లేని వారు పోటీ చేసే పరిస్థితులు లేవు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు అంటేనే డబ్బు మయం అనే పరిస్తితి ఏర్పడింది అని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా స్వామ్యం లో సామాజిక సేవకు ప్రాముఖ్యత లేకుండా పోయింది అని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ సంస్థల వ్యక్తులు, భూ కబ్జా దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజా భక్షకులు గా తయారు అవుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఆఘమేఘాల పై నిర్వహించడం, ప్రచారానికి కేవలం వారం రోజుల సమయం ఉండటం విచారకరం అని పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ నేతల పై, కేంద్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే, కేంద్రం ఎందుకు సహాయం అందించలేదొ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులతో బీజేపీ బురద రాజకీయం చేయడం దుర్మార్గము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.