తెలంగాణ ప్లాస్మా దానం లో ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచింది

Thursday, August 27th, 2020, 03:35:38 PM IST

భారత దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భారత్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం లో ప్లాస్మా దానం పై పోలీస్ అధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్మా దానం లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచింది అని తాజాగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని తో సమానం అని సజ్జనర్ అన్నారు. గచ్చిబౌలి లోని సైబరాబాద్ కార్యాలయం లో హోం మంత్రి మహమూద్ అలీ తో కలిసి ప్లాస్మా దాతలను సన్మానించారు సజ్జనార్. లాక్ డౌన్ సమయం లో 5,300 బ్లడ్ యూనిట్ లను సేకరించిన విషయాన్ని తెలిపారు. అంతేకాక 600 మంది ప్లాస్మా దానం చేసి 1,350 మంది ప్రాణాలను కాపాడిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక ఈ క్లిష్ట సమయంలో వాలంటీర్లు, మీడియా కీలక పాత్ర పోషిస్తున్నారు అని ప్రశంసలు కురిపించారు.