ఏపీలో పెరుగుతున్న కేసులు – ప్రజల్లో ఆందోళన

Thursday, April 2nd, 2020, 08:38:25 AM IST

గతకొంత కాలంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వణికిస్తున్నటువంటి భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది మరణించగా, ఇప్పటికి కొన్ని లక్షల మందికి ఈ వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రోజురోజుకు ఈ వైరస్ పాజిటివ్ కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇకపోతే ఇండియా విషయానికొస్తే ఈ వైరస్ దారుణంగా వ్యాపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకే రోజులో రికార్డు స్థాయిలో ఈ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ వైరస్ ని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో పకడ్బందీగా లాక్ డౌన్ ని అమలు చేశాయి. కానీ కొందరి తప్పిదాల వలన ఈ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.

కాగా ఏపీలో బుధవారంనాడు ఒక్కరోజే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా 111కు చేరింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఏపీ నోడల్ అధికారి హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. కాగా, గుంటూరు జిల్లాలో 20, కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో 15 చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలులో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈకేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని, పలు హెచ్చరికలు చేస్తున్నారు అధికారులు.