చిరంజీవికి కరోనా.. సీఎం కేసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా?

Monday, November 9th, 2020, 05:00:44 PM IST

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. సామాన్య ప్రజలతో పాటు ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడగా తాజాగా మెగస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ప్రస్తూతానికి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపాడు.

అయితే గత 4-5 రోజులుగా తనను కలిసి వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని కూడా కోరారు. ఇదిలా ఉంటే చిరంజీవి కరోనా బారిన పడడంతో సీఎం కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను చిరంజీవి, నాగార్జున కలిశారు. వరద సాయం చెక్కు అందిస్తున్న సమయంలో కనీసం సీఎం కేసీఆర్, చిరంజీవి మాస్క్ కూడా పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు చిరంజీవికి కరోనా అని తేలడంతో సీఎం కేసీఆర్‌తో పాటు, సీఎస్ సోమేశ్ కుమార్, హీరో నాగార్జున తదితరులు‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది.