రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా!

Sunday, February 28th, 2021, 04:10:32 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. అయితే మార్చి 1 వ తేదీ నుండి రెండవ దశ వాక్సినేషన్ ప్రక్రియ కి శ్రీకారం చుట్టాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. 60 ఏళ్ల వయసు పై బడిన వారు, 45 ఏళ్లు నుండి 59 వరకూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా వాక్సినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. అయితే వీరు టీకా తీసుకోవడానికి cowin.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు.

అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కరోనా టీకా అందిస్తున్నట్లు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం మొబైల్ కి వచ్చిన లింక్ ద్వారా దగ్గర్లో ఉన్నటువంటి వాక్సిన్ కేంద్రాల్లో కోవిద్ టీకా తీసుకోవచ్చు అని శ్రీనివాస రావు అన్నారు.ప్రతి జిల్లాలో 2, గ్రేటర్ హైదరాబాద్ లో 12 వాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడి కార్డ్ తో పాటుగా, వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు తీసుకొని రావాలని పేర్కొన్నారు. అయితే ఆన్ లైన్ లో ఈ ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేసినా కొవిడ్ టీకా తీసుకొనేందుకు అర్హులు అని వ్యాఖ్యానించారు.అయితే ప్రైవేటు లో 215 ఆసుపత్రులకు వాక్సినేషన్ ఇచ్చేందుకు అనుమతి ఉందని అన్నారు.