ఇకపై పోటీ చేయను.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Saturday, March 20th, 2021, 07:30:49 PM IST

మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చిన్నారెడ్డి కీలెక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. డబ్బులు లేకపోతే ఎవరు ఎన్నికల్లో పోటీచేయవద్దని, డబ్బులు పంచిన వారికే ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. అయితే చదువుకున్న పట్టభద్రులు కూడా అధికార టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగించిందని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదని అన్నారు. అయితే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ డబ్బుల ప్రవాహాన్ని తట్టుకుని నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలుస్తారన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. ఇకపై తాను తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని అన్నారు. అయితే తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.