గ్రేటర్ ఎఫెక్ట్: టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా..!

Friday, December 4th, 2020, 08:30:40 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టును కోల్పోయింది. గ్రేటర్‌లోని మొత్తం 150 డివిజన్లలో కేవలం రెండింట మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడింది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని భావించిన గ్రేటర్ ప్రజలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇదే కాకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ వైపు మళ్ళడంతో ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తరవాత పీసీసీ భాద్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీనీ గెలిపించలేకపోయారు. 2016 గ్రేటర్ ఎన్నికలలో ఓటమి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లను గెలిచినప్పటికి చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీనీ వీడారు. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. ఇక హుజూర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికలలో కూడా సత్తా చాటలేకపోయింది.