బిగ్ న్యూస్: మళ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయిన కాంగ్రెస్…తెరాస కి బీజేపీ గట్టి పోటీ!

Friday, December 4th, 2020, 03:47:33 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి సింగిల్ డిజిట్ కే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇంక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా, ఒక స్థానం లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మరొక రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గట్టిగా ప్రచారం చేసినప్పటికీ ఓట్లు మాత్రం రాబట్టలేకపోయారు.

మరొకపక్క దుబ్బాక ఉపఎన్నిక విజయం తో జోరు మీద ఉన్న బీజేపీ, అధికార పార్టీ తెరాస కి గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొదట పోస్టల్ ఓట్లలో పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని కనబరిచిన బీజేపీ, బ్యాలెట్ ఓట్ల వద్దకు వచ్చే సరికి తెరాస ముందంజ లో ఉంది. ఇప్పటి వరకు 16 స్థానాల్లో గెలుపొందిన తెరాస, ఇంకా 43 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అదే తరహా మజ్లిస్ పార్టీ 26 స్థానాల్లో గెలుపొంది, ఇంకా 14 స్థానాల్లో ఆధిక్యాన్ని సంపాదించింది. బీజేపీ మాత్రం ఇంకా ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీ ఇంకా 39 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం మీద మరొకసారి తెరాస మేయర్ పీఠాన్ని అధిష్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ సైతం తన హవా కొనసాగిస్తోంది. ఈసారి బీజేపీ దూకుడుగా వ్యవహరించడం తో మునుపటి కంటే ఎక్కువ స్థానాల్లో ఓట్లు సంపాదించుకుంది.