దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది.. ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Monday, February 1st, 2021, 04:14:22 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్ఝెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ట్యాక్స్ ఎక్కువగా వెళుతుంటే, నిధులు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను ప్రధాని మోదీ విరమించుకోవాలని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోవడం ఖాయమని అన్నారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని ఉద్యమిస్తారని హెచ్చరించారు. దేశ ప్రధానిగా మొదీ అయినప్పట్టి నుంచి దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని, ప్రాధాన్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వారికే కట్టబెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోదీ, కేసీఆర్‌లకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని సవరణలు చేస్తున్నప్పుడు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు.