తెలంగాణ ప్రభుత్వం పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sunday, October 11th, 2020, 09:00:30 PM IST

అధికార తెరాస పై తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని, బతుకులు బాగుపడతాయి అని అనుకుంటే భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో నల్గొండ జిల్లాను ఈ విధంగానే పాడు చేశారు అంటూ ఆరోపణలు చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా యాచారం లో ఫార్మాసిటీ వ్యతిరేక సభ లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాల పై తెరాస నేతలు పడ్డారు అని, ఫార్మా సిటీ అంటేనే ఒక కుంభకోణం అని, అధికార పార్టీ నేతలు డబ్బు సంపాదించుకోవడం కోసమే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అని ఎంపీ కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ల నుండి ఎమ్మెల్యే ల వరకు అక్రమ దనార్జన పైనే దృష్టి పెట్టారు అని ఎంపీ తెలిపారు. తెలంగాణ ప్రజలు బాగుండాలి అని కోరుకొనే వాడిని అని, ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.గ్రామాల్లో ఎటువంటి అభివృద్ది చేయని కేటీఆర్, ఫార్మా సిటీ ల పేరుతో స్మశాన వాటికలు కట్టిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.