మంత్రి ఈటల టీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేస్తున్నారు – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Sunday, February 7th, 2021, 03:00:28 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేటీఆర్‌కు సీఎం కావడానికి అవకాశం ఉండవచ్చని, సీఎం అయ్యేందుకు కేటీఆర్ సమర్థుడే అయినా సీఎం కేసీఆర్ కుమారుడనే వారసత్వ ముద్ర ఆయనపై ఉందని అన్నారు. అయితే కేటీఆర్‌కు బదులు ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తే పార్టీలో అంతా ఏకాభిప్రాయంతో ఉంటారని జీవన్ రెడ్డి ఇదివరకే చెప్పుకొచ్చారు .

అయితే కొద్ది రోజులుగా మంత్రి ఈటల మాట్లాడుతున్న మాటలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీనిపై తాజాగా స్పందించిన జీవన్ రెడ్డి మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‎పై తిరుగుబాటు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలు లేకుండా ఎత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉనికి కోల్పోతుందని, ఐకేపీ సెంటర్లను ఎత్తివేయడం సాధ్యం కాదని మంత్రి ఈటల రాజేందరే అంటున్నారని గుర్తు చేశారు. అయితే సీఎం కేసీఆర్ రైతులను మోదీ వద్ద తాకట్టుపెట్టారని విమర్శించారు.