కేటీఆర్ బెటర్ అంటే.. కేసీఆర్ ఫెయిల్ అని ఒప్పుకున్నట్టే – జీవన్ రెడ్డి

Friday, January 22nd, 2021, 03:32:28 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఅర్ త్వరలోనే సీఎం అవుతున్నారని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ సీఎంగా బెటర్ అంటున్నారంటే.. కేసీఆర్ సీఎంగా ఫెయిల్ అయినట్టు టీఆర్ఎస్ నేతలు ఒప్పుకున్నట్టే అని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు వయస్సు మల్లిందన్న కారణంతోనే కేటీఆర్‌ను తెర మీదకు తీసుకువస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై ఉన్న శ్రద్ధ పాలనపై గాని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కానీ లేదని జీవన్ రెడ్డి అన్నారు.

అయితే ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయుష్మన్ భారత్‌కు ఒకే చెప్పారని ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోవడంతోనే అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ అమలు చేశారని అన్నారు. అయితే గిరిజన రిజర్వేషన్లు 10 శాతం ఎప్పుడు అమలు చేస్తారో కేసీఆర్ సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంగా కేసీఆర్ చేసిన సేవలు చాలన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.