దయచేసి మీ రాకపోకలు సాగించకండి.. సీఎం కేసీఆర్‌కు సీతక్క విన్నపం..!

Sunday, October 18th, 2020, 02:30:16 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఫామ్ హౌస్, ప్రగతి భవన్ మధ్య దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దారిలో సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పోలీసులు ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేస్తుంటారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం హైదరబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో కూడా ఇది ఇలానే కొనసాగుతుండడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సెటైర్లు గుప్పించారు.

ఎల్వీ ప్రసాద్ మార్గ్‌లోని సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మరోపక్క వర్షంలో భారీగా నిలిచిపోయిన వాహనాల వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీసుకు రాకపోకలు సాగించకండని, మీ ప్రయాణాల వల్ల ఈ భారీ వర్షాల్లో 60 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోందని అన్నారు. పాపం వాళ్లు కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరాలి కదా ఓ సారి ఆలోచించండి అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.