అంతా బాగుంటే సభ ఎందుకు.. టీఆర్ఎస్ సర్కార్‌పై ఎమ్మెలే సీతక్క ఫైర్..!

Monday, September 14th, 2020, 05:04:11 PM IST

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. అయితే సభలో టీఆర్ఎస్ సర్కార్ తీరుపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలను మాట్లాడకుండా గొంతులు నొక్కేస్తున్నారని అలా చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుందని అన్నారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్, స్వల్ప కాలిక చర్చ లేనే లేదని అన్నారు. ఎంతసేపు టీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారే తప్పా సమస్యల గురుంచి మాట్లాడడం లేదన్నారు.

అసలు ఏ సమస్య లేనప్పుడు ఇక సభ ఎందుకు.. బాగా లేకపోతేనే కాదా అంటూ ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీ ముందు ఆత్మాహుతికి పాల్పడ్డ తెలంగాణ నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తెలంగాణ నాగులుగా పేరు ఉన్న ఆయన మృతదేహంపై టీఆర్ఎస్ కండువా కప్పారని అలాంటి వ్యక్తికి కనీసం టీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించకపోవడం బాధాకరమని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా అనేక రంగాలకు దెబ్బపడిందని వారందరిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.