పీవీ ఇప్పుడు గుర్తొచ్చారా.. సీఎం కేసీఆర్‌కి సీతక్క సూటి ప్రశ్న..!

Wednesday, September 9th, 2020, 11:50:52 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సూటి ప్రశ్న వేశారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించగా దీనికి ఏకగ్రీవ తీర్మానం లభించింది. అయితే దీనిపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగి ప్రధాని అయిన పీవీ గురుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కనీసం మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.

ప్రజాస్వామ్యం ఉంది అని మాట్లాడే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గొంతు నొక్కడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఘన కీర్తిని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఆరేళ్ళుగా పీవీ పేరు గురుంచి మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు భారతరత్న ఇవ్వాలంటూ ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలకందరికి తెలుసని అన్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్ళేందుకే కేసీఆర్ పీవీ పేరును వాడుకుంటూ, తెలంగాణకు కేటీఆర్‌ని సీఎం చేయాలని చూస్తున్నారని అన్నారు.