కాంగ్రెస్‌లో కలకలం.. భవిష్యత్తులో బీజేపీలో చేరుతానంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..!

Saturday, January 2nd, 2021, 11:52:58 AM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. నిన్న నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరోసారి బీజేపీలో చేరిక ప్రస్తావన తీసుకొచ్చారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ బాంబు పేల్చారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని 2019 జూలైలోనే తాను చెప్పానని, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు.

ఇకపోతే తన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని, అన్నదమ్ములుగా మేము కలిసే ఉంటున్నా రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం వెంకట్‌రెడ్డితో పాటు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని ఇందులో ఎవరిని ఆ పదవి వరిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.