సాగర్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ.. మాట మార్చేసిన రాజగోపాల్‌రెడ్డి..!

Tuesday, March 23rd, 2021, 12:08:04 AM IST


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి తన మాట మార్చారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తనను బీజేపీలోకి రమ్మని కొందరు సంప్రదిస్తున్నారని, తనని నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేయాలని కూడా అడుగుతున్నారని, ఒకవేళ తాను బీజేపీ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డి మూడో స్థానానికి పరిమితమవుతారని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు టీఆర్ఎస్‌ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని, ఇదే విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

అయితే నేడు మరోసారి మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ప్రజల్లో ఓడిందని అతీన్మార్ మల్లన్న, టీజేఎస్ అధినేత కోదండరాం, బీజేపీ నేత రామచందర్‌రావు ఓడి గెలిచారని అన్నారు. తెలంగాణలో ప్రజలు ఫైటర్స్‌కే సపోర్ట్ చేస్తారని మల్లన్న ఓట్లు చూశాక అర్ధమయ్యిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో ఎప్పుడేమైనా జరగొచ్చని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులతో ఓట్లు కొని సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. సాగర్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని, జానారెడ్డి చేసిన అభివృద్ధే నాగార్జున సాగర్‌లో ఆయన్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు మా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏమీ లేవని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.