ధరణి యాప్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి – జగ్గారెడ్డి

Thursday, October 8th, 2020, 07:30:13 PM IST

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రతి భూమి యొక్క వివరాలు ధరణి అనే యాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే ధరణి యాప్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధరణి అనే ప్రైవేటు యాప్‌తో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, ఆస్తుల వివరాల సేకరణలో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు.

అయితే ప్రజల ఆస్తులపై ప్రైవేటు వ్యక్తులకు చెందిన ధరణి యాప్ అప్పులు తీసుకునే అవకాశం ఉందని అనుమానాలు వస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు కొత్త చట్టం తెచ్చే సమయంలో కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకునేవారని, ధరణి యాప్ ద్వారా చేస్తున్న ఆస్తుల వివరాల సేకరణకు ప్రభుత్వం ఎందుకు అభిప్రాయాలు తీసుకోలేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ధరణి వ్యవస్థ తెలంగాణలో అవసరమా అని నిలదీశారు. అయితే దీనిపై అసెంబ్లీలో మాట్లాడటానికి కాంగ్రెస్ సభ్యులకు సమయం కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే సామాన్య ప్రజల ఆస్తుల వివరాల మాదిరిగానే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల భూముల వివరాలు కూడా ధరణి యాప్‌లో పెడితే అందరికీ ఆదర్శంగా ఉంటుందని అన్నారు.