పీసీసీ పోరు: సోనియా, రాహుల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ..!

Saturday, January 2nd, 2021, 08:04:00 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఇప్పటికే హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోనియా, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. పీసీసీ అధ్యక్ష పదవిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇబ్బందిరకరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు అందరినీ కలుపుకొని పార్టీకి విదేయులుగా ఉండే నాయకత్వం కావాలి కానీ పులులు, సింహాలు కాదని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి 25 మందితో కమిటీ వేస్తే బాగుంటుందని, బలమైన నాయకులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత అప్పగించాలని కోరారు. రైతులు, నిరుద్యోగులు‌, మహిళలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై పోరాడేందుకు విడివిడిగా కమిటీలు వేయాలని, వారిని సమన్వయం చేసే బాధ్యత పీసీసీకి అప్పగించాలని అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ ఎంపిక నిర్ణయం వాయిదా వేయాని, సాగర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్టానానికి తెలిపారు.